History

అగ్ని కుల క్షత్రియ కులము వంశపరంపరగా వచ్చిన కుల వౄత్తి ఆధారంగా ఏర్పడిన ప్రాచీన ఆదిమ కులాల్లో ఒక కులం కాదు. అది ఈ మధ్యకాలంలో అనగా క్రీస్తుకు పూర్వము సిమారు 400 సంవత్సరముల క్రిందట కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో భారతదేశ రక్షణ నిమిత్తం ఏర్పరచబడిన కులము. ఆ కులము పేరును తమకు అర్హత లేని గొప్పతనాన్ని ఆపాదించుకొనుటకుగాను ఎవరో కొద్దిమంది ఏర్పరుచుకున్న పేరు కాదు. దానికి వైభవోపేతమైన గత చరిత్ర ఎంతో ఉంది. అటువంటి ఉన్నత విలువలు గల కులము యొక్క అస్తిత్వము నేడు ప్రశ్నార్థకమైనది. అ.కు.క్ష.ల యొక్క పూర్వవైభవమును తెలియజేయు కొన్ని చారిత్రక సత్యములు ఈ క్రింద ఇవ్వబడినవి….

అగ్ని కుల క్షత్రియుల యొక్క పుట్టుక :-

ప్రముఖ దేశీయ చారిత్రక పరిశోధకులైన శ్రీ కోట వెంకటాచలం గారు రచించిన `అగ్ని కుల క్షత్రియులు లేక బ్రహ్మక్షత్రులూ అను గ్రంథమునందు ఈ క్రింది విధముగా వ్రాశారు…

“… ఆంధ్ర శాతవాహన వంశము అనేక భాగములై దేశములో అల్ప రాజ్యములు స్థాపించి ఎవరికి వారు స్వతంత్రులుగానుండిరి. వాయవ్య భారతదేశమున శక, హూణ, ఘార్జరాది విదేశీజాతులవారు అల్ప రాజ్యములకు ప్రభువులైయుండి అవకాశము ఒరికినపుడెల్లను దేశమును కొల్లగొట్టుచు, స్త్రీ, బాల, వౄద్ధులను సైతము హింసించుచుండిరి. అల్ప రాజ్యములని ఏకం చేసి నాయకత్వం వహించి పరదేశీయుల దాడినుండి దేశమును రక్షించగల చక్రవర్తిత్వము లేకపోయినది. దేశము అరాచకముగనున్నట్లేర్పడెను. ఆ సమయంలో హిందూరాజులు పీఠాధిపులకు శిష్యులై ధర్మయుక్తముగా పాలించుచుండిరి. ఇట్టి స్థితిలో పీఠాధిపులు బ్రాహ్మణరాజ వంశములనుండి వీరులగు నాలుగు కుటుంబముల వారినేరి వారియందు బ్రహ్మతేజస్సును, క్షాత్రతేజస్సును నిలుచునట్లు సంకల్పించి వేద మంత్రములచే అగ్నినుపాసింపజేసి వారి చేత హోమాదులు చేయించి దేశమును నాలుగు భాగములుగానొనర్చి వారు నలుగురిని ఆయా భాగములకు అథినాధులుగానొనర్చిరి. ఈ నాలుగు వంశముల వారును `అగ్ని కుల క్షత్రియులూ అని పిలువబడిరి. అగ్నికులమనగా అగ్నిఏవుని వంశమునకు చెందినవారు. అగ్ని – దేవతలలో బ్రాహ్మణుడు. అగ్నికులమన బ్రాహ్మణ వర్ణము. బ్రాహ్మణ వర్ణమందు పుట్టి క్షాత్రమవలంబించిన వాడు `అగ్ని కుల క్షత్రియుడూ అని `బ్రహ్మ క్షత్రుడూ అని పిలవబడెను….” అని వ్రాశారు.

మరొక ప్రముఖ దేశీయ చరిత్ర పరిశోధకులైన శ్రీ కొమర్రాజు లక్ష్మణరావు పంతులు గారు రచించిన “చాళుక్యులు దాక్షిణాత్యులే” అను పరిశోధన వ్యాసమందు ఉత్తర దేశమునందలి `సోళంకులూ అగ్ని కుల క్షత్రియులని, సూర్య, చంద్ర వంశములే గాక అగ్నివంశమనునది కూడ కలదని వ్రాశారు. ఆయన “…. ఉత్తర దేశమునందలి చాళుక్యులు అనగా సోళంకులు తాము అ.కు.క్షత్రియులమని చెప్పుకొనసాగిరని, పవార్ (ప్రమార), పరిహారీ (ప్రతిహారీ), చౌహాన్ (చాహుమాన), సోళంకి (చాళుక్య) – ఈ నాలుగు క్షత్రియ జాతులను అ.కు.క్ష.లని రాజపుత్ర స్థానమందనియెదరు…” అని కూడా వ్రాశారు.

పై రెండు వ్యాసములను పరిసీలించినయెడల – మొదటి వ్యాసములో `అగ్ని కుల క్షత్రియా అను పేరు ఏర్పడిన విధము, ఏర్పడిన కాలము, దేశము నాలుగు చెరగులా అ.కు.క్ష. రాజవంశముల్వారు పరిపాలించిన విషయము తెలియుచున్నది. రెండవ వ్యాసములో `అగ్నికులమూ అనునది చాళుక్యులకు పూర్వకాలమునందే ఉన్నదనియు, ఉత్తర హిందూదేశము పాలించిన రాజులు కూడ అ.కు.క్ష.లేనని నిర్ధారణమవుచున్నది.

ఈ విధముగా చారిత్రక పరిశోధకులు అ.కు.క్ష.లు ఏర్పడిన కాలము, ఏర్పడిన సందర్భమును గురించి ఏకాభిప్రాయము వెళ్ళబుచ్చారు. అ.కు.క్ష. కులము ఈ మధ్య కాలములో దేశ రక్షణ కొరకు ప్రత్యేకముగా ఏర్పరచబడిన కులము అనేది అవాస్తవము.

 నేటి అ.కు.క్ష.లు ఆనాటి అ.కు.క్ష.లైన పల్లవ వంశీకులా?

`ఔనూ అనేదే దీనికి సమాధానము.

హోమాదుల ద్వారా బ్రహ్మ తేజస్సును, క్షాత్ర తేజస్సును నింపబడిన నలుగురు బ్రాహ్మణ రాజ వంశీకులు దేశము నాలుగు భాగములకు అధినాధులుగా చేయబడినారు కదా! ఆ నలుగురు తమతోజేరి తమ నాయకత్వము అంగీకరించిన సామంతరాజులతో కలసి దేశమునకు ఎట్టి బాధయూ కలగకుండా కాపాడగలిగారు. చాళుక్యులు, పల్లవులు, కదంబ, చేడ మొదలగు రాజవంశముల వారు ఆ విధముగా నియమింపబడినవారు. వారిలో పల్లవులు శాతవాహనులకు సామంతరాజులుగా ఉన్నారు. పల్లవులు బ్రాహ్మణులని చరిత్ర చెబుతున్నది. (చూడు పే.52 `ఆంధ్రుల సంక్షిప్త చరిత్రా)

ఆంధ్ర మహా సామ్రాజ్యము అంతరించిన తర్వాత అప్పటి వరకు శతవాహనులకు సామంత రాజులుగానుండిన పల్లవులు స్వతంత్రులై క్రీ.శ.200 నుండి క్రీ.శ.700 వరకు కౄష్ణానదికి దక్షిణాన ఉన్న ఆంధ్రదేశాన్ని కాంచీపురమును రాజధానిగా చేసుకొని పరిపాలించారు. వీరి పరిపాలన కాలంలో తూర్పుసముద్ర తీరమునుండి ఆంధ్రులు అత్యంత సాహసధైర్యములతో స్వదేశమును వదలి అతి దూరస్థలములగు జావా, సుమత్రా, మలయా ద్వీపములకును, బర్మా, సయాం, కాంబోడియా మొదలగు తూర్పుదేశములకు వాణిజ్య వాంఛతో వలసపోయి, ఆయా దేశములను జయించి వలస రాజ్యములను ఏర్పరుచుకొని ఆంధ్రదేశమునకే కాక యావద్భారతదేశానికి కూడ దిగంత, విశ్రాంత కీర్తిని సంపాదించియున్నారు. శాతవాహనుల కాలంలో నౌకాయానమునకు పల్లవులు అధిక ప్రాధాన్యతను ఇచ్చి అభివౄద్దీ పరిచారు. అప్పుడు ప్రారంభమైన నౌకా నిర్మాణము, దేశీయ విదేశీయ నౌకా యానము, నౌకా వాణిజ్యము ఆంధ్రదేశంలో పల్లవ వంశపాలన అంతరించిన తర్వాత ఈ మధ్యకాలం వరకు అ.కు.క్ష.ల అధీనములోనే కొనసాగినది అనే విషయం జగద్విదితం.

శాతవాహనులు బౌద్ధమతమును స్వీకరించి ఆ మతమును పోషించి అభివౄద్ధి పరచగా వారికి సామంతులుగా ఉన్న పల్లవులు మాత్రము బ్రాహ్మణ మతాభిమానులై హిందూమతాభివౄద్ధికి కౄషిచేసి బౌద్ధమతమును ఈ దేశమునుండి బయటకు పంపివేశారు. ఆ సందర్భంలో హిందుదేవాలయ నిర్మాణ వ్యవస్థ ప్రారంభమైనది. అప్పటివరకు వేదసంస్కౄతిలో విగ్రహారాధన లేదు. దేవాలయ వ్యవస్థ లేదు. దేవాలయ వ్యవస్థకు ఆద్యులు పల్లవులే. అటువంటి హిందూదేవాలయ వ్యవస్థ ఇప్పటికీ కొన్ని ప్రాంతాలలో అ.కు.క్ష.ల ఆధీనంలోనే వారే పూజారులుగా కూడ నడుస్తూ ఉంది. నెల్లూరు, గూడూరులలోని ద్రౌపది, ధర్మరాజు దేవాలయాలు ఇందుకు ఉదాహరణ. ఇటీవల అనగా 28.4.2009న మతమార్పిడుల నిరోధానికి దేశవ్యాప్త శోభాయాత్రలు తలపెట్టిన విశాఖ శారదా పీఠాధిపతి స్వరూపానందేద్ర సరస్వతి స్వామీజీ హిందూ దేవాలయ వ్యవస్థకు కులాలతోగల సంబంధముని గురించి వివరించుతూ…`ఆలయాలు నిర్మాణం చేసే పని అగ్నికుల క్షత్రియులదీ అని చెప్పారు. (ఆంధ్రజ్యోతి 29-4-2009). కీ.శే. సత్యలింగం నాయకర్, కీ.శే. కొపనాతి కౄష్ణమ్మగారు, పినపోతు గజేంద్రుడుగారు, కీ.శే. పెదసింగు స్వామి గారు మొదలగు అ.కు.క్ష.లు ఆలయనిర్మాణం చేయడంకాని, ధ్వజస్థంభములెత్తడంగాని చేసిన ప్రముఖులలో కొందరు. ఈ విధముగా పల్లవుల కాలంలో ప్రారంభింపబడి వారి ఆధ్వర్యంలో ఎంతో వైభవైశ్వర్యములతో కొనసాగిన దేశీయ విదేశీయ నౌకాయానము ఈ మధ్య కాలం వరకు అ.కు.క్ష.ల అధీనంలోనే కొనసాగియుండడము, అప్పటి దేవాలయ వ్యవస్థ కొన్ని ప్రాంతాలలో ఇప్పటికీ అ.కు.క్ష.ల అధీనంలోనె కొనసాగుచుండడం గమనించితే నేటి అ.కు.క్ష.లు పల్లవ వంశీకులమని చెప్పుకోవడానికి సందేహింపనవసరంలేదు.